విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతపై కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి భర్త, వైఎస్సార్‌సీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డి తనకు బదులు వేరొకరిని కోర్టు వాయిదాకు పంపారు. దీంతో జడ్జి ఆగ్రహానికి గురయ్యారు.. చివరకు ఆయన కోర్టుకు క్షమాపణలు చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2015 ఆగస్టు 29న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద ధర్నాలో పాల్గొన్న 9 మందిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేయగా.. వారిలో శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
ఈ కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. మంగళవారం కోర్టు వాయిదాకు శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. డ్రైవర్ మురారిని పంపించారు. కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలుస్తుండగా.. మురారి కోర్టు హాలులోకి వచ్చారు. తడబడుతుండడం, వయసు తేడా ఉండడంతో కోర్టు సిబ్బంది ప్రశ్నించారు. తాను శ్రీనివాసరెడ్డిని కాదనీ, ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లడంతో తాను వచ్చానని బదులిచ్చారు. శ్రీనివాసరెడ్డిని పిలిపించాలని జడ్జి గాయత్రీదేవి ఆదేశించారు.. కాసేపటికి ఆయన కోర్టులో హాజరయ్యారు. కోర్టులంటే ఆషామాషీ అనుకుంటున్నారా అని ఆగ్రహించిన న్యాయమూర్తి.. ఏదైనా ఉంటే న్యాయవాదికి చెప్పాలి కానీ, వేరొకరిని పంపించడమేంటని నిలదీసీ సంజాయిషీ లేఖ తీసుకొని పంపించారు.