అంతం అయిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. చాప కింద నీరు లాగా రోజు రోజుకూ వ్యాప్తి చెందుతూ మరోసారి మానవాళిని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికాలో పుట్టి చైనాలో కరోనా వ్యాప్తికి కారణమైన కొత్త వేరియంట్ జేఎన్ 1 ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ప్రస్తుత చలికాలంలో ఈ జేఎన్ 1 వేరియంట్ బారి నుంచి తప్పించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. మన దేశంలో కేరళలో తొలి జేఎన్ 1 వేరియంట్ కేసు నమోదు కావడంతో భారత్‌లోనూ దీని గురించి కొత్త భయాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం జేఎన్ 1 కొవిడ్ సబ్ వేరియంట్ కేరళలో వెలుగు చూసిన నేపథ్యంలో ఇలాంటి ఇన్‌ఫ్లుఎంజా వ్యాధులను పర్యవేక్షించి.. నివేదికను ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త సబ్ వేరియంట్ JN1ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఆసక్తి వేరియంట్)గా వర్గీకరించింది. అయితే ఈ కరోనా వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు వాటిల్లదని డబ్ల్యూహెచ్ఓ కొంత ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది. ఇప్పటికే జేఎన్ 1 కొత్త ఉప వేరియంట్ వల్ల కలిగే ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉందని ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1, కరోనా వైరస్ ఇతర వేరియంట్ల వల్ల సంభవించే వ్యాధి వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కొవిడ్, జేఎన్ 1 సబ్ వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయిని తెలిపింది.
ఏడాదిన్నర రెండేళ్లుగా కరోనా మహమ్మారి జాడ లేక ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి ఆ వ్యాధి విజృంభిస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త వేరియంట్ జేఎన్ 1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అయితే ఇప్పటికే కరోనా 3 వేవ్‌లతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో మరణాల సంఖ్య భారీగా ఉండగా.. మూడో వేవ్‌లో కాస్త తక్కువగా ఉంది. తాజాగా మన దేశంలో తొలిసారిగా కేరళలో ఈ కొత్త వేరియంట్ జేఎన్ 1 కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. బీఏ 2.86 కొవిడ్ సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 కారణంగానే దేశంలో క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం చలి కాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.