దేశంలో రోజురోజుకూ బియ్యం ధరలు పెరుగుతుండం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మార్కెట్లో సన్న బియ్యం ధరలు అమాంతం పెరుగుతుండటంతో సామాన్యులకు మరింత కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం బాస్మతీయేతర బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు ఏకంగా రూ.1000 పైనే పెరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాజాగా బియ్యం పరిశ్రమలకు కీలక ఆదేశాలను జారీ చేసింది.
దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలను సమీక్షించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రెటరీ సంజీవ్ చోప్రా.. రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో తాజాగా సమావేశం అయ్యారు. సన్న బియ్యం ధరలు అదుపులో ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద రూ.29 లకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారని.. రైస్ ప్రాసెసర్లు అదే బియ్యాన్ని మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారని తెలిపారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని సమావేశంలో సంజీవ్ చోప్రా వెల్లడించారు.
బియ్యం రిటైల్ ధరల్ని సమీక్షించి ధరల్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని రైస్ ప్రాసెసింగ్ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్ దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్నది సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. టోకు వ్యాపారులు, రిటైలర్స్ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని.. దాన్ని వెంటనే నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బియ్యం ఎంఆర్‌పీకి, రిటైల్ ధరల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని.. దాన్ని సరిచేస్తే బియ్యం ధరలు తగ్గేందుకు అవకాశముందని సమావేశంలో పలువురు చెప్పినట్లు సమాచారం బియ్యం ధరలు పెరుగుతుండటంతో గత జూలైలో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు.. ఎగుమతి సుంకాలను 20 శాతం వరకు పెంచింది. మరోవైపు.. బియ్యం ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు మిల్లర్లు, ట్రేడర్లు.. తమ చేతి వాటం ప్రదర్శించి సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ బియ్యం ధరలు పెరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.