అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్‌హౌస్‌లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొలరాడో సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2020 లో అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించిన కేసులో విచారణ జరిపిన కొలరాడో సుప్రీంకోర్టు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.
అయితే ఇప్పటివరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం పోటీ పడుతున్న వారిలో డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉండటంతో అధ్యక్ష బరిలో ఉంటానని ట్రంప్ ధీమాగా ఉన్నారు. తాజా తీర్పుతో ఆ ఆశలకు గండి పడింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్ అనర్హుడని కొలరాడో కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.
2020 అధ్యక్ష ఎన్నికల అనంతరం క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ వల్లే జరిగిందని కొలరాడో కోర్టు తెలిపింది. అప్పుడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6 వ తేదీన ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లో భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ ర్యాలీ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ట్రంప్ కారణంగానే క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిందని.. అందుకే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏడుగురు సభ్యుల బెంచ్ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా ఎన్నికైన జో బైడెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేందుకు ట్రంప్ కుట్ర చేశారని బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా కోర్టు వెల్లడించింది.
ఇక ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. అయితే ఈ తీర్పు కేవలం కొలరాడో రాష్ట్రం వరకు మాత్రమే పరిమితం అవుతుందని వెల్లడించింది. అంటే కేవలం కొలరాడో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించనున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలకు మాత్రం ఈ కోర్టు తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. దీంతో 2024 మార్చి 5 వ తేదీన కొలరాడోలో జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పేరు ఉండదు. దీంతో 2024 నవంబరు 5 వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఇది పెను ప్రభావం చూపించనుంది.
అయితే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు.. ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌కు అవకాశం కల్పించింది. ఈ అప్పీల్‌కు వచ్చే ఏడాది జనవరి 4 వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు కొలరాడో సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో కొలరాడో స్టేట్ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తారా లేదా అనే నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. ఈ క్రమంలోనే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అటార్నీ.. సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది.