అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డొనాల్డ్ ట్రంప్‌పై కొలరాడో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పుపై రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి స్పందించారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు వివేక్ రామస్వామి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వివేక్ రామస్వామి తప్పుపట్టారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్‌కు అనుమతి ఇవ్వకపోతే తాను కూడా ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు.
ట్రంప్‌పై కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ మీడియా వేదికగా వివేక్ రామస్వామి స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించి ఆయనను అనుమతించకపోతే.. తాను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు సమర్థించిన వారు అవుతారని తెలిపారు. ఇలాంటి తీర్పుల కారణంగా అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివేక్ రామస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. కొలరాడో సుప్రీంకోర్టు తనపై ఇచ్చిన తీర్పుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కుట్రలో భాగమేనని ట్రంప్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను నిలువరించేందుకు బైడెన్ చేస్తున్న ఇలాంటి విపరీత చర్యలు తనకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని ట్రంప్ తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు అని.. వచ్చే ఎన్నికల్లో తమ చేతిలో ఘోరంగా ఓడిపోతామని తెలిసి కోర్టుల ద్వారా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ట్రంప్ మండిపడ్డారు.