పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ వైయస్ఆర్‌సీపీ మండల స్థాయి నాయకుడిని చంపేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారని, దీనికోసం కర్నూలు జిల్లాకు చెందిన కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చినట్టు స్థానిక వైసీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులూ తెలిపిన వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఆర్‌అండ్‌బీ ప్రాంతంలో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ఇద్దరిని వైయస్ఆర్‌సీపీ దుర్గి మండల నాయకుడు మన్నెయ్య, అతని అనుచరులు పట్టుకున్నారు. వారిని స్థానిక పోలీసులకు అప్పగించగా వెంటనే స్పందించిన పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు కారం పొడి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన సుఫారీ గ్యాంగ్ ముఠా అని, బుధవారం మధ్యాహ్నం పట్టణానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడిని చంపేందుకు వచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వివరాలు తెలుపుతామని మాచర్ల పోలీసులు చెబుతున్నారు.