అమరావతి రాజధాని ప్రాంతంతో సహా, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో క్రైస్తవ ఆస్తులను, దళితుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా దోచేశారని, చంద్రబాబు, ఆయన అనుచరులు దోచేసిన క్రైస్తవ ఆస్తులను చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ.... గుంటూరు, విజయవాడలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. క్రైస్తవులు, దళితుల ఆస్తులను కాపాడటంతోపాటు, రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవవేతనాలను ఇవ్వడంతో పాటు, దళిత క్రిస్టియన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు. అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. వందేళ్ళ తర్వాత భూసర్వే జరిపించి, భూ సంస్కరణలు తెచ్చి, 22 ఏ, అసైన్డ్ భూములకు సంబంధించి దాదాపు 35 లక్షల ఎకరాలకు నిజమైన అర్హులకు హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.