తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేనని.. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్లాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి.. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదని సీపీఐ నారాయణ అన్నారు. అయితే, పొత్తులపై నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో చెలిమికి తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు నాయుడు అనంతరం కాంగ్రెస్ పార్టీకి కాస్త దగ్గరయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపక.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమయ్యారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. రేవంత్ రెడ్డి విజయోత్సవ ర్యాలీలోనూ టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.
ఇక పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన మాత్రం కొన్నేళ్లుగా బీజేపీతో సఖ్యతగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేశాయి. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. అయితే, టీడీపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు బీజేపీ ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ‘టీడీపీ, జనసేన, బీజేపీ’ కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించలేదు. అలాగని.. ఈ అంశాన్ని కొట్టిపారేయలేదు. మరోవైపు.. టీడీపీ, జనసేన అధ్యక్షులు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరు పార్టీలూ కలిసి సీరియస్‌గా పనిచేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.
జగన్‌ను ఎదుర్కోవాలంటే వివిధ పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్నాయని, బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఉండే పార్టీలతో తాము కలిసి వెళ్లేదిలేదని నారాయణ అన్నారు. ఇండియా కూటమితో అనుకూలంగా ఉండే వ్యక్తులతో కలిసి ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ నారాయణ కొన్ని రోజుల కిందట వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాల్లోనూ తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని ఆయన అన్నారు. ‘తెలంగాణలో మా పార్టీకి 90 నుంచి 100 నియోజకవర్గాల్లో 1000 నుంచి 10,000 వరకు ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఈ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయి. మా పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోడింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలి’ అని నారాయణ అన్నారు.
కాంగ్రెస్ గెలిచినా, ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమని నారాయణ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో 4, తమిళనాడులో 2, పశ్చిమ బెంగాల్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్‌సభ స్థానంలో సీపీఐ పోటీ చేస్తుందని నారాయణ తెలిపారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.