రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ సినిమా ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. దీనిపై న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్, థియేటర్ సహా మరే వేదికల్లోనూ దీనిని విడుదల చేయరాదని ఆదేశించింది. దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సినిమా తీశారని పిటిషన్‌లో లోకేశ్ పేర్కొన్నారు. తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపిస్తూ.. వ్యూహం సినిమాలో పిటిషనర్ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.