వచ్చే నెలలో జరగబోయే అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన ఊహించినట్లుగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ అంశంగా మారుతోంది. జనవరి 22న జరిగే ఆలయ ప్రాణప్రతిష్ఠకు దేశవ్యాప్తంగా పలువురు మతపెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. అయితే, ప్రతిపక్ష నేతలకు పంపిన ఆహ్వానాలు మాత్రం వార్తల్లో నిలుస్తున్నాయి. తాము మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని తాజాగా సీపీఎం ప్రకటించింది. మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారని, అందుకే తాము వెళ్లబోమని సీపీఐ (ఎం) నాయకురాలు బృందా కారత్ స్పష్టం చేశారు.
‘మేము ఆ వేడుకకు వెళ్లం.. మేము మత విశ్వాసాలను గౌరవిస్తాం... కానీ వారు మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో అనుసంధానిస్తున్నారు.. మతాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం లేదా రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం సరికాదు’ అని కారత్ అభిప్రాయపడ్డారు. రామమందిర నిర్మాణం భుజాలకెత్తుకున్న బీజేపీ దీనిని వచ్చే లోక్‌సభతో పాటు రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనుంది. కాగా, కారత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి కౌంటర్ ఇస్తూ... ‘అందరికీ ఆహ్వానాలు పంపారు.. (కానీ) రాముడు పిలిచిన వారు మాత్రమే వస్తారు’ అని అన్నారు.
అయితే, మందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్షాల్లో వామపక్ష నేతలు మాత్రమే కాదు. కాంగ్రెస్ మాజీ నాయకుడు కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ నా హృదయంలో రాముడు ఉన్నాడు కాబట్టి, ఈ వేడుకకు హాజరు కావాల్సిన అవసరం లేదని, ఇది ఎన్నికలకు ముందు బీజేపీ బలపరిచే అవకాశం ఉందని అన్నారు. రాముడి పేరు చెప్పి బీజేపీ షో చేస్తోందని సిబల్ విమర్శించారు. ‘వారు రాముడి గురించి మాట్లాడతారు, కానీ వారి చేతలు ఆ పాత్ర ఎక్కడా దగ్గరగా ఉండవు. నిజం, సహనం, త్యాగం, ఇతరుల పట్ల గౌరవం రాముడి లక్షణాలలో కొన్ని కానీ వారు ఖచ్చితంగా దానికి విరుద్ధంగా చేస్తారు... మన హృదయంలో రాముడు ఆచరించిన సూత్రాలు ఉండాలి.’ అని అన్నారు. సీపీఐ కూడా ఈ వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
కమ్యూనిస్ట్‌లు, సిబల్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు, నేతలు తమ వైఖరిని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లపైనే అందరి చూపు ఉంది. వీరందరికీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానాలు అందాయి. ఏది ఏమైనప్పటికీ, అయోధ్య రామ మందిర ఆహ్వానాలపై అనిశ్చితి, రాజకీయ వివాదం ప్రతిపక్ష నాయకులకు మాత్రమే పరిమితం కాలేదు. రామమందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించి ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కూడా పక్కనబెట్టడం గమనార్హం. పాతతరం నేతలను బీజేపీ అవమానించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే, విశ్వహిందూ పరిషత్ మాత్రం అద్వానీ, జోషిలకి ఆహ్వానాలు పంపినట్లు తెలిపింది. కానీ వారు హాజరవుతారనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు; వీహెచ్‌పీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇద్దరు సీనియర్లు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa