ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో తైవాన్‌ విలీనం తథ్యం.. కుట్రలు సాగనివ్వం: అమెరికాకు చైనా వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 08:40 PM

తైవాన్‌ను తమ భూభాగామేనని, దానిని వేరుచేసే కుట్రలను అడ్డుకోడానికి కృతనిశ్చయంతో ఉన్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. తైవాన్ తమలో విలీనం కాకతప్పదని ఆయన స్పష్టం చేశారు. తైవాన్‌లో వచ్చే జనవరిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా మాజీ పాలకుడు మావో జెడాంగ్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిన్‌పింగ్.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తైవాన్‌ను తమ ప్రధాన భూభాగంతో మళ్లీ ఏకం చేస్తుందని ఇటీవల శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జిన్‌పింగ్‌కు స్పష్టం చేసినట్టు ప్రచారం జరిగింది. తాజాగా, మాతృభూమితో తప్పనిసరిగా పునరేకీకరణ జరగాలని, అది అనివార్యమని జి జిన్‌పింగ్ అన్నారు. ‘మాతృభూమితో పునరేకీకరణ జరగాలి.. అది అనివార్యం. తైవాన్‌ను చైనా నుంచి వేరు కానీయం. తైవాన్‌ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలి’ అని జిన్‌పింగ్‌ ప్రతిజ్ఞ చేశారు.


తైవాన్‌ విషయంలో బీజింగ్ వైఖరిని పునరుద్ఘాటించిన ఆయన.. అక్కడ జరగబోయే ఎన్నికలు, దానిపై బలప్రయోగం వంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు. అధికారిక మీడియా జిన్హువా ప్రకారం.. బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లోని సమాధి వద్ద మావో జెడాంగ్ విజయాలను స్మరించుకున్న జిన్‌పింగ్.. దేశం అత్యంత శక్తివంతమైన నిర్ణయాధికార సంస్థ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీకి కూడా నాయకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు.


తైవాన్‌ను బలవంతంగా తీసుకోకుండా శాంతియుతంగా తీసుకోవడమే చైనా అభిమతం జో బైడెన్‌తో జిన్‌పింగ్ చెప్పినట్లు నివేదికలు వెలువడ్డాయి. 2025 లేదా 2027లో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని జి జిన్‌పింగ్ యోచిస్తున్నారనే అమెరికా నిఘా వర్గాల అంచనాలను ప్రస్తావిస్తూ.. అవి తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.


తైవాన్‌‌ను శాంతియుతంగా విలీనం చేసుకోవాలనే చైనా లక్ష్యానికి అమెరికా మద్దతిస్తోందని, ఆ దేశ స్వాతంత్య్రానికి మద్దతివ్వడం లేదని సమావేశం తర్వాత బహిరంగ ప్రకటన చేయాలని చైనా అధికారులు జో బైడెన్‌ను కోరారు. ఈ అభ్యర్థనను వైట్‌హౌస్ తిరస్కరించిందని నివేదిక పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ స్వయంపాలిత ప్రజాస్వామ్య ద్వీపంలో కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు తైవాన్ పట్ల చైనా ప్రవర్తన మరింత దూకుడుగా కనిపిస్తోంది.


అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ప్రతిస్పందిస్తూ.. ‘ఈ కథనం ఆందోళనకు మించింది.. దీనిపై డెమొక్రాటిక్, రిపబ్లికన్ సెనేటర్‌లతో కలిసి పని చేస్తాను.. మొదట, తైవాన్‌కు పటిష్టమైన రక్షణను రూపొందించండి.. రెండోది తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైనిక చర్యలకు దిగితే కట్టడికి కఠిన ఆంక్షలను రూపొందించాలి’ అని అన్నారు. తైవాన్‌‌లో జనవరి 13న ఎన్నికలు జరగనున్నాయి. 2027లో తైవాన్‌పై దండయాత్రకు చైనా సిద్ధంగా ఉండాలని షీ జిన్‌పింగ్‌ ఆదేశించినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ నేత లయ్‌ చింగ్‌-టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. తైవాన్‌లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com