దేశంలోని సున్నితమైన సైనిక పరికరాల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దని, అవి జాతీయ భద్రతకు ప్రమాదం కలిగిస్తాయని సైనిక ఔత్సాహికులను చైనా హెచ్చరించింది. సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. వియ్‌చాట్‌లో చైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ హెచ్చరికను పోస్ట్ చేసింది. వందల మిలియన్ల మంది యూజర్లు ఉన్న వీబో వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సున్నితమైన సైనిక పరికరాల గురించి పెద్ద ఎత్తున సమాచారం వ్యాప్తి చెందుతుందనే ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపింది. తన బలగాలను చైనా వేగంగా ఆధునీకరిస్తున్నందున ఈ ఫోటోలు సాధారణ సైట్‌గా మారాయి.
‘ఇది మంచి అభిరుచి.. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఔత్సాహికులు జాతీయ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొందడం, వాటిని ఇంటర్నెట్‌లో ప్రసారం చేయడం ద్వారా జాతీయ సైనిక భద్రతను తీవ్రంగా ప్రమాదంలో పడేస్తున్నారు’ అని చైనా ప్రభుత్వ భద్రతా మంత్రిత్వ శాఖ వీచాట్‌లో పేర్కొన్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ‘సైనిక విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జాతీయ రక్షణ,సైనిక పారిశ్రామిక విభాగాలపై దృష్టి సారించి.. వారు నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించే ఫెర్రీలు లేదా విమానాలల్లో టెలిఫోటో లెన్స్‌లు లేదా డ్రోన్‌లతో రహస్యంగా ఫోటో తీశారు’ గూఢచారి సంస్థ తెలిపింది. మొదటిసారి లేదా అప్పుడప్పుడు నేరస్థులు హెచ్చరికను మాత్రమే అందుకుంటారు కానీ నియమాన్ని ఉల్లంఘించి పునరావృతం చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది’ అని ఏజెన్సీ స్పష్టం చేసింది.
ఈ ఫోటోలు విమాన వాహక నౌకల వంటి సైనిక పరికరాలలో సాంకేతిక వివరాలను, పురోగతిని బహిర్గతం చేయగలవని.. పోరాట ప్రభావాన్ని విశ్లేషించడానికి ప్రత్యర్ధి దళాలు ఉపయోగించవచ్చని హైలెట్ చేసింది. స్థావరాలు, సైనిక పరికరాల వివరాలను బహిర్గతం చేయడం ద్వారా రక్షణ ప్రణాళికను ప్రభావితం చేస్తుంది అని పేర్కొంది. సైనిక పరికరాలను రహస్యంగా చిత్రీకరించడానికి టెలిఫోటో లెన్స్‌లు, డ్రోన్‌ల వంటి ప్రొఫెషనల్ పరికరాలను ఉపయోగించిన నేరస్థులకు శిక్ష తప్పదని హెచ్చరించినట్టు నివేదిక తెలిపింది. 2021లో ఫుజియాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రహస్యంగా చిత్రీకరించిన ఓ వ్యక్తికి దేశ రహస్యాలను అక్రమంగా పొందారనే ఆరోపణలతో చైనా జైలు శిక్ష విధించింది.