స్కిల్ కార్పొరేషన్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌కు సంబంధించి కొందరు ప్రతివాదులకు నోటీసులు ఇంకా చేరలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి హైకోర్టుకు తెలియజేశారు. నోటీసులు తీసుకునేందుకు కొందరు విముఖత చూపారని.. తలుపులకు తాళాలువేసి ఉన్న కారణంగా మరికొన్ని వెనక్కి వచ్చాయన్నారు. పత్రికాప్రకటన ద్వారా వీరికి నోటీసులు పంపించేందుకు అనుమతించాలని కోరారు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది. విచారణను వాయిదా వేస్తూ జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.