జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్‌లో నేరుగా జమ చేస్తున్నారు.