అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం సాయంత్రం తన నివాసం వద్ద కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.... పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏ రకమైన అభివృద్ది చేయాలని, ఏ సమస్య పరిష్కరించాలనే దానిపై స్థానిక మేనిఫెస్టో తయారు చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఇందుకు 109 పంచాయతీల్లో పార్టీ బాధ్యులు, టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రధాన సమస్యలను తెలియజేయాలన్నారు. ఇందుకు గ్రామ వికాసపత్రాన్ని పూర్తి చేయాల్సి వుంటుందన్నారు. అసంపూర్తిగా వున్న జల్లూరు వంతెన, పాయకరావుపేటలో డబుల్ రోడ్డు నిర్మాణం, ఉద్దండపురం వాటర్ ప్రాజెక్ట్, వేమగిరి రోడ్డు నిర్మాణాలు వంటి సమస్యలను లోకల్ మేనిఫెస్టోలో చేర్చుతున్నట్టు చెప్పారు.