ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.... గిరిజనుల ఆరోగ్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక అబివృద్ధి కోసం జగన్ నిరంతరం పని చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను రద్దు చేసి చంద్రబాబు వివక్ష చూపారని, జగన్ సీఎం అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా గిరిజనులకే పెద్దపీట వేసారని గుర్తు చేసారు. టీడీపీ గిరిజనుల కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయగా, రూ. 23 వేలకోట్లు ఖర్చు చేసి సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేసారన్నారు. రాజ్యాంగ పరమైన హక్కులను కల్పించే ఎస్టీ కమిషన్ ను జగన్ సీఎం కాగానే నియామకాలు చేసారని, చంద్రబాబు హయాంలో ఎస్టీ కమిషన్, ట్రైకార్, జీసీసీ వంటి పదవులను భర్తీ చేయకుండా గిరిజనులను తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ 3, 46,000 ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేసి భూమి హక్కులను కల్పించారన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏకమై జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.