డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 వ తేదీ ఉదయం 5 గంటల వరకు విజయవాడలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ ఆంక్షల సమయంలో కేక్ కటింగ్‌లు చేస్తూ, కేరింతలు కొడుతూ, బైక్ రైడింగ్‌లు చేస్తూ రోడ్లపై గుంపులుగా తిరిగితే అలాంటి వారిపై కేసులు పెడతామని విజయవాడ సీపీ గట్టి హెచ్చరికలు చేశారు. డిసెంబర్ 31 వ తేదీన రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. ప్రతి చోటా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేపడతామని సీపీ వెల్లడించారు. అలాగే డిసెంబర్ 31 వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 వ తేదీ ఉదయం 5 గంటల వరకు విజయవాడలో అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని తెలిపారు. ఎంజీ రోడ్డు, బందర్‌రోడ్డు ఫ్లై ఓవర్‌పై కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని విజయవాడ నగర సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
న్యూఇయర్ నేపథ్యంలో విజయవాడలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. ఇక రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు కేక్ కటింగ్‌లకు అనుమతి లేదని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో పోలీస్ యాక్ట్, సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా బహిరంగంగా ఐదుగురు మించి గుమిగూడకూడదని సీపీ తెలిపారు. స్టార్ హోటల్స్‌లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే పోలీసుల అనుమతి తీసుకోవాలని.. హోటల్స్‌లో లిక్కర్ సర్వీస్ చేస్తే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకొవాలని సూచించారు.