టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఇప్పుడు మరో రెబల్ అభ్యర్థి తెరపైకి వచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అధికార పార్టీకి చెందిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం మొరసనపల్లె సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కుప్పం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తనను వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థిగా పరిచయం చేసుకుంటూ.. ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పంలో పోటీ చేస్తానంటూ ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తున్న సమయంలోనే.. నీలిమ కూడా ప్రచారం మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు ఇప్పటికైనా మేలు కోవాలని.. రాబోయే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తున్నారు. కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పించలేదని.. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నీలిమ చెబుతున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఇన్నాళ్లూ మోసం చేశాయన్నారు నీలిమ. అసలు 14 ఏళ్ల సీఎంగా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నించారు.ఈ నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలన్నారు. కుప్పంలో ఇసుక, గ్రానైట్‌ను దోచుకునేందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నారని.. ఒక్క షర్ట్, ఫ్యాంట్ వేసుకుని వచ్చి ఈ రోజు రెండు వేల కోట్లు దోచుకున్నారంటూ విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకులు కుప్పంలో అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు.
ప్రజలు కడుపు నింపుకోవడానికి పొట్ట చేత పట్టి బెంగుళూరుకు కూలీ పనులకు వెళ్తున్నారన్నారు నీలిమ. చంద్రబాబు హాయాంలో కానీ, వైఎష్ జగన్ హయాంలో కానీ కుప్పం ప్రజలకు న్యాయం జరగలేదని.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కుప్పంకు సాఫ్ట్‌వేర్ కంపెనీని తీసుకొస్తానన్నారు. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి, తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ ప్రజలను విన్నవిస్తున్నారు. నీలిమ నియోజకవర్గంలో ఇంటింటికి తిరగి ఇప్పటి నుంచే ఓట్లు అడగటం చర్చనీయాంశం అవుతోంది.