దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మరోసారి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత రెండు వారాలుగా రోజువారీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 800లకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నాయి. గత 227 రోజుల్లో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం.
కేరళ, కర్ణాటక, బిహార్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు చెప్పారు. డిసెంబరు 5 వరకు దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే, కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి, ఆపై శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం డ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది చివరిలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్, పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్, పుదుచ్చేరిలో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కొత్తరకం వేరియంట్ జేఎన్ 1 కేసుల సంఖ్య 178కి చేరుకున్నాయి. వీటిలో అత్యధికంగా కేరళలో 41, గుజరాత్‌లో 36, కర్ణాటక 34, మహారాష్ట్ర 9, తమిళనాడు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున, తెలంగాణలో రెండు, ఢిల్లీలో ఒక కేసు వచ్చాయి.