కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న ఆలయంలో అర్చకుడి చేతివాటం బయటపడింది. స్థానికంగా గ్రామ దేవత దేవాలయం ఉంది.. అక్కడ పని చేసే అర్చకుల్లో ఎవరి వంతు వస్తే వారే ఆలయంలో కాపలాగా పడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక అర్చకుడి వంతు కాగా.. అతడి పెదనాన్న కుమారుడు తాను పడుకుంటానని చెప్పడంతో అంగీకరించాడు. దీంతో కొన్ని రోజులుగా ఆయన రాత్రి పూట పలాదారుగా ఆలయంలో పడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు చోరీకి గురవుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌కు రహస్య సమాచారం వచ్చింది.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై మంగళవారం ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. డిసెంబర్ 28, 30 తేదీల్లో అర్చకుడు హుండీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాపై ఓ వస్త్రాన్ని వేసి ఒక ఇనుప రాడ్డుకి అయస్కాంతం తగిలించి హుండీలోని నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. గతేడాది అక్టోబర్ 5న హుండీలు తెరిచి కానుకల్ని లెక్కించారు. అప్పటి నుంచి భక్తులు వేసిన కానుకలు హుండీలో ఉన్నట్లు కమిటీ ప్రతినిధులు చెప్పారు. గతంలో ఒక అర్చకుడు అమ్మవారి ఆభరణాలు దొంగిలించాడు. అది రుజువు కావడంతో అతనికి శిక్ష పడింది.. అనంతరం అతడ్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ హుండీలో చోరీ వ్యవహారం కలకలంరేపింది. అయితే అర్చకుడు చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.