అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం పదో రోజు కొనసాగింది. అనంతపురంలో సీఐటీయూ, మున్సిపల్ వర్కర్స్ యూనియన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన నాయకుడు నాగభూషణం ఇంజనీరింగ్ కార్మికులతో కలిసి అనంతపురానికి నీటి సరఫరా చేసే కొర్రకొల్లు డ్యామ్ వద్ద రెండు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయించారు. వారిని కూడేరు పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. నగరంలో చెత్త తరలింపు వాహనాలను అడ్డుకున్నారు. తాడిపత్రిలో చెత్త తరలింపు కోసం ప్రైవేటు వాహనాలను, కార్మికులను పురమాయించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పది రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చేశారు. ట్రాక్టర్లను, ప్రైవేటు కార్మికులను ఉపసంహరించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యేని హెచ్చరించారు.