వైసీపీ నాయకత్వానికి భ్రమించిందని, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరిలో నేడు జరుగనున్న చంద్రబాబు శంఖారావసభకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయన స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్ ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి స్థానిక లక్ష్మీమిల్క్ డెయిరీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యేలతో ఐదేళ్లు పనిచేయిచుకొని, ఇప్పుడు వారికి ప్రజల్లో ఆధరణ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అభ్యర్థులను ఆ పార్టీ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక నేడు టీడీపీ ఆధ్వర్యంలో కనిగిరిలో నిర్వహించనున్న శాంఖారావం సభను విజయవంతం చేయా లని కోరారు. 45 ఏళ్లకే ఫించన్ ఇస్తానని హామీ ఇచ్చి జగన్ మాట తప్పాడని పేర్కొన్నారు. రూ.2వేల కోట్ల అభయహస్తం బీమా డబ్బులను దారి మళ్లించాడని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం పట్టిందని, సీఎం రిలీఫ్ ఫండ్‌కు అడ్రస్ లేదని అన్నారు. అమ్మఒడిని ఒకరికే పరిమితం చేశారని విమర్శించారు. వెలిగొండకు అధికారహోదా రద్దు కాగా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్లి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గుండ్లకమ్మకు మూడు గేట్లు కొట్టుకుపోతే రిపేరు చేసిన పాపాన పోలేదన్నారు. ఇసుక దోపిడీ కోసమే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్కామ్ ఉంటేనే స్కీమ్ పెడుతున్నారని వైసీపీపై ఆరోపించారు. 90శాతం పూర్తయిన 21 లక్షల టిడ్కో గృహాలను ఐదేళ్లుగా ఎవరికీ ఇవ్వకుండా మోసం చేసిన ఘనత జగన్‌దేనన్నారు. మిగులు భూములను కాజేసేందుకే భూసర్వే చేపట్టాడని దుయ్యబట్టారు.