ఏపీలో ఉచిత బస్సు హామీపై నిరసనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి జీవో ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో.. ఆటో డ్రైవర్ ఆందోళనకు దిగారు. విశాఖలోని గాజువాక నియోజకవర్గం ఆటోలను నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దంటూ.. గాజువాక నియోజకవర్గం పరిధిలో 86 ఆటో యూనియన్లు శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే తాము ఉపాధి కోల్పోతామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. ఈ ప్రభుత్వమైనా.. వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వమైనా ఈ హామీని అమలు చేయొద్దని కోరుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ వలన తాము ఇబ్బంది పడతామంటున్నారు ఆటో డ్రైవర్లు. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండగ సమయంలో మహిళల్ని ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ అధికారుల నుంచి సమాచారం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హామీ అమలు చేస్తే ఎంత వ్యయమవుతుంది.. పొరుగు రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు.. వంటి వివరాలను ఆర్టీసీ అధికారుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ ఇప్పటికే ఉచిత బస్సు హామీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు గతేడాది మేలో జరిగిన మహానాడులో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే జగన్ సర్కార్ అమలు చేయాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల్ని ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే ఆర్థికంగా నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే రాయితీని ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.. ఇది కూడా ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో రోజు సగటున 40 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు.. వీరిలో 15 లక్షలకు పైగా మహిళలు ఉంటారని ఓ అంచనా ఉంది. మహిళల్ని ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే.. నెలకు రూ.150 కోట్ల నుంచి 180 కోట్ల వరకు రాబడి తగ్గిపోతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అధికారికంగా రాలేదు. మరి జగన్ సర్కార్ ఈ ఫ్రీ బస్సు హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.