శబరిమల అయ్యప్ప ఉత్సవాలు ఏడాదికి కేవలం 2 నెలలు మాత్రమే జరుగుతాయి. ఇక అయ్యప్ప దర్శనం కోసం భక్తులు ఎంత ఎగబడిపోతారో శబరిమల ప్రసాదమైన అరవణ ప్రసాదం కోసం కూడా అంతే ఎగబడుతారు. శబరిమలకు ఎవరైనా వెళ్లారంటే డబ్బాలకు డబ్బాలు అరవణ ప్రసాదాన్ని తీసుకువస్తారు. ఇక శబరిమలకు వెళ్లిన వారిని ఆ అరవణ ప్రసాదం తీసుకురమ్మని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అరవణ ప్రసాదం టేస్టే వేరు. అయితే ఈసారి అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు భారీగా శబరిమలకు పోటెత్తారు. ఈ క్రమంలోనే వచ్చిన భక్తులకు సరిపడా అరవణ ప్రసాదాన్ని అందించలేకపోయారు. దీంతో భక్తులకు పంపిణీ చేసే అరవణ ప్రసాదంపై ఆంక్షలు విధించారు. కేవలం ఒకరికి రెండు డబ్బాల అరవణ ప్రసాదాన్ని మాత్రమే ఇవ్వనున్నట్లు శబరిమల నిర్వహణ ఏర్పాట్లు చూసే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తేల్చి చెప్పింది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అందించే అరవణ ప్రసాదంపై తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిమితులు విధించింది. భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే పంపిణీ చేస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.
ప్రసాదం డబ్బాల కొరత, భారీగా భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. మకర జ్యోతి దర్శనానికి మరింత మంది భక్తులు శబరిమలకు వస్తారని.. దీంతో ఆ భక్తులు అందిరికీ ప్రసాదం అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే అరవణ ప్రసాదం పంపిణీపై పరిమితులు విధిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయంపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి అయ్యప్ప దర్శనంతోపాటు అరవణ ప్రసాదం కోసం వచ్చిన భక్తులను ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. అయితే త్వరలోనే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను పరిష్కరించేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అయితే అరవణ ప్రసాదం పంపిణీని పెంచేందుకు డిసెంబరు 26 వ తేదీన మరో 2 కొత్త కంపెనీలకు ప్రసాదం డబ్బాల కాంట్రాక్టును ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఆ 2 కంపెనీలు అవసరమైన మొత్తంలో అరవణ ప్రసాదం డబ్బాలను అందించలేకపోయాయని పేర్కొన్నారు. ఫలితంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.