వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన 10 రోజులకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు.. తాజాగా మరో ట్వీట్ చేశారు. వైసీసీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానంటూ ప్రకటన చేసిన 10 రోజుల వ్యవధిలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటనపై విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో అంబటి రాయుడు పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ‘జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 టోర్నీలో నేను ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాను. ప్రొఫెషనల్ క్రీడను ఆడుతున్న కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అంబటి రాయుడు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. అయితే, ఈ పోస్టు పైనా నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
‘పార్టీలో చేరడానికి ముందు ఈ విషయం తెలియదా?’ అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ‘ఆడుదాం ఆంధ్రా బ్యాట్ తీసుకెళ్లు రాయుడు’ అని మరో యూజర్ సెటైర్ వేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలకు అంబటి రాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ‘అక్కడైనా సరిగా ఆడు..’ అంటూ మరో యూజర్ పోస్టు చేశాడు.
అంబటి రాయుడు ‘వైఎస్సార్‌సీపీ’ని వీడటంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందని అర్థం చేసుకొని.. ఫీల్డ్‌లోకి దిగకముందే అంబటి రాయుడు పారిపోయాడని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ జగన్ తత్వం ఆయనకు త్వరగానే బోధపడిందని వ్యాఖ్యానించారు. ‘గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తానని అంబటి రాయుడికి జగన్ చెప్పారు. పని చేసుకోమన్నారు. తీరా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా.. గుంటూరు టికెట్ మరో వ్యక్తికి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
‘వైఎస్ జగన్ తీరు అలా ఉంటుంది. వాడుకోవడం, వదిలేయడం’ అని చంద్రబాబు విమర్శించారు. ఆదివారం (జనవరి 7) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో అంబటి రాయుడు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంబటి రాయుడు డిసెంబర్ 28 వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన 10 రోజులకే తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు రాయుడు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.