వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆమె సోదరుడు రాములును కర్నూలు జిల్లాలో ఆదివారం దారుణంగా హత్య చేశారు. పెండేకల్లు రైల్వే జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను దుండగులు రాయితో కొట్టి చంపారు. 30 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ పార్టీలో పని చేసిన రాములు.. 1991లో పోలీసులకు లొంగిపోయారు. జనజీవ స్రవంతిలో కలిసిన తర్వాత స్వగ్రామంలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆయన...10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌లో నిద్రించిన సమయంలో.. దుండగులు బండరాయితో మోది దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సునీత సోదరుడైన పూజారి రాము నక్సల్ ఉద్యమంలో చేరి.. 1985 నుంచి 1991 వరకు నల్లమల ఫారెస్ట్‌లో బోనాసి దళం కమాండర్‌గా పనిచేశారు. అలాగే, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఉద్యమాన్ని వీడిన తర్వాత కొన్నాళలు బాగానే ఉన్నారు. కొద్దిరోజులుగా ఆయన మానసిక పరిస్థితి సక్రమంగా లేక మతిస్థితి కోల్పోయి పెండేకల్ రైల్వే జంక్షన్ లోనే ఉన్నారు. ఆయన తమ్ముడు, ఉద్యమకారుడు పూజారి లెనిన్ బాబు మాట్లాడుతూ.. తమ అన్నను ఎవరో హత్య చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ పెండేకల్లులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇక, పోతుల సునీత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి.. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడారు. కొద్ది రోజులకు కృష్ణమోహన్ టీడీపీలోకి రావడంతో సునీతతో విభేదాలు మొదలయ్యాయి. 2017లో సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే ఆమంచి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరగా.. సునీత టీడీపీలో ఉన్నారు. కానీ, ఫలితాల తర్వాత టీడీపని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు.