ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన నోటీసు అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. జరిమానాగా విధించిన రూ.40 కోట్ల చెల్లింపుతో సహా నోటీసు అమలును 6 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి వచ్చిన పెట్టుబడులను ఆర్బీఐ అనుమతిలేకుండా వేరే కంపెనీని బదలాయించారనే ఆరోపణలతో రఘురామపై కేసు నమోదయ్యింది.
ఆయనకు చెందిన ఇంద్ భారత్ సన్ ఎనర్జీ రూ.202 కోట్లు పెట్టుబడులుగా పొందిన రెండో రోజే ఇలా చేసిందని ఈడీ ఆరోపించింది. ఎన్నారై పెట్టుబడులను మరో కంపెనీకి మళ్లించాలంటే ఆర్‌బీఐ అనుమతులు అవసరని, కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా నిధుల బదలాయించినట్టు పేర్కొంది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఇంద్ భారత్ సన్ ఎనర్జీ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రఘురామకు రూ.40 కోట్ల జరిమానా విధిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. ఎంపీ రఘురామ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ పూసర్ల.. కంపెనీ డైరెక్టర్ పదవికి పిటిషనర్ రాజీనామా చేశారని చెప్పారు. కంపెనీకి పంపిన నోటీసులు అందకపోగా మారిన చిరునామాల ప్రకారం ముంబయిలోని ప్రస్తుత డైరెక్టర్లకు అందాయని తెలిపారు. పిటిషనర్‌కు తెలియకుండా జరిగిన దానికి జరిమానా విధించడం అన్యాయమని వాదించారు. దీనికి కౌంటర్‌గా ఈడీ తరఫు న్యాయవాది.. పిటిషన్ విచారణార్హం కాదని, పిటిషనర్‌కు ప్రత్యామ్నాయం ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి కేసు నమోదైన ఆరేళ్ల తరువాత ప్రొసీడింగ్స్ జారీ చేశారని, ప్రొసీడింగ్స్‌ను గరిష్ఠంగా ఏడాదిలో లోపు జారీ చేయాల్సి ఉందని చెప్పారు. ఇందులో జాప్యానికి కారణాలనూ పేర్కొనకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.