వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు.