టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన రాయుడు.. జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సాయంత్రం సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడానికి కారణాన్ని కూడా తెలిపారు రాయుడు. క్రికెట్ ఆడటం కోసం రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ మరో ట్వీట్ చేశారు. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది.