ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్‌లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బలకోటయ్య హైకోర్టులో ఫిటిషన్ వేశారు. బుధవారం విచారణ జరపగా.. కుల, నివాస, ఆదాయ సర్టిఫికెట్లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లపై కేవలం జాతీయ చిహ్నం, లేదా రాష్ట్రానికి సంబంధించిన ఎంబ్లమ్ మాత్రమే ఉండాలన్నారు. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని.. సర్టిఫికెట్లు తీసుకునే ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డ్ సచివాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి కేసు విచారణ వాయిదా వేసింది.