తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. రెండు రోజులుగా భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తుండగా.. ఇవాళ కూడా అదే పరిస్థితి కనిపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. సర్వ దర్శనం భక్తులకు కూడా త్వరగానే దర్శనం అవుతోంది. మంగళవారం శ్రీవారిని 65,901 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. స్వామివారికి 16,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తాషి రాబ్ట్సన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (నీటివనరులు) ఛైర్మన్ పర్భత్‌బాయ్ సవాభాయ్ పటేల్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు దర్శించుకున్నారు. సినీ హీరో సుధీర్‌బాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మూలమూర్తి సేవలో పాల్గొన్నారు.