ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.. పార్టీల్లో చేరికలు కూడా ఊపందుకున్నాయి. అధికార పార్టీలో నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి.. ప్రతిపక్ష పార్టీల్లో నుంచి అధికార పార్టీల్లోకి కండువాలు మార్చేస్తున్నారు కొందరు. ప్రధానంగా టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ తెలుగు దేశానికి జై కొట్టగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి వైఎస్సార్‌సీపీ నుంచి పెనమలూరు టికెట్ హామీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం ఇప్పటికే బుజ్జగించినా ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు జరిగాయి. విజయవాడలో కార్యాలయంలో పార్థసారథితో టీడీపీ నేతలు నేతలతో భేటీ అయ్యారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావులు సారథితో చర్చించారు. సారథిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈనెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో పార్థసారథి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ నేతలు వచ్చారని తెలియడంతో ఆ వెంటనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లు కూడా ఎమ్మెలయే పార్థసారథిని కలిశారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. సముచిత ప్రాధాన్యం ఇస్తామని.. పార్టీలోనే కొనసాగాలని బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదని తెలుస్తోంది. కొలుసు పార్థసారథి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరి మచిలీపట్నం ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో మాత్రం పెనమలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు..కానీ ఆయనకు మాత్రం సీఎం జగన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. అయినా సరే సారథి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇటీవల జరిగిన బస్సు యాత్ర సభలో అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.