ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీ ఫిరాయింపులు పెరిగాయి. వైఎస్సార్‌సీపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్.. వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. లోక్ సభ సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని వెల్లడించారు. బుధవారం (జనవరి 10) విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. అధికార వైఎస్సార్‌సీపీ పార్టీపై, సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామనేది కేవలం ఒక జనరల్ స్టేట్‌మెంట్ మాత్రమేనని.. పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదని ఆరోపించారు. నియోజకవర్గానికి 10 శాతం కూడా అభివృద్ధి చేయలేకపోయానని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, ఆయన చుట్టూ ఉండే కొంత మందికి దగ్గరగా ఉన్న వారికే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘కర్నూలు జిల్లాకు తుంగభద్ర ఉన్నా.. మాకు నీళ్లు లేవు. ఒక్క పంట పండిస్తే మాకు గొప్ప. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవు. కర్నూలు నుంచి ఏటా 2.59 లక్షల మంది వలస వెళ్తున్నారు’ అని సంజీవ్ కుమార్ అన్నారు.
‘మేము ఎన్నికైన తర్వాత అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారు అని చెప్పారు. అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటే ఇక నా పాత్ర ఏమిటి?’ అని ఎంపీ సంజీవ్ కుమార్ ప్రశ్నించారు. కర్నూలుకు మెడికల్, ఎన్‌హెచ్, రైల్వే పరంగా చాలా వరకు ప్రగతి సాధించానని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నా.. నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్నూలు నుంచి బళ్లారి జాతీయ రహదారి ఫైల్‌ను కేంద్ర మంత్రి గడ్కరీ వరకు తీసుకెళ్లాను. తర్వాత దాని గురించి ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదు. కర్నూల్ మెడికల్ కాలేజీకి 7 సూపర్ స్పెషాలిటీ సీట్లు తీసుకొచ్చా’ అని సంజీవ్ కుమార్ తెలిపారు. ‘ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కేవలం రెండు సార్లు కలిశా. నా ఫోన్లకు, సందేశాలకు కూడా సమాధానం లేదు. విజయసాయి రెడ్డితోనూ మాట్లాడాను. అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత స్పందన లేదు’ అని సంజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు.
‘నేను ఇచ్చిన హామీలు నెరవేరాయా? లేదా? అని 45 రోజులుగా ఆలోచించుకున్నాను. ఎంపీగా గెలిచినా.. ఏమీ చేయలేకపోతున్నా. అందుకే వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేదే నా లక్ష్యం. వలసలు ఆగాలంటే పెద్ద స్థాయిలో నిర్ణయాలు జరగాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు’ అని సంజీవ్ కుమార్ అన్నారు. కర్నూలు పార్లమెంట్ టికెట్‌ను మరో వ్యక్తికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జి పదవి నుంచి సంజీవ్ కుమార్‌ను తప్పించింది. దీంతో సంజీవ్ కుమార్ మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని, మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటానని సంజీవ్ కుమార్ తెలిపారు. పేదల డాక్టర్‌గా తనకు పేరుందని, రోజుకు 25 వేల ఆపరేషన్లు చేస్తానని చెప్పారు.