పూసపాటి అశోక్‌గజపతి రాజు.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత. అలాగే రాజవంశీయులైన అశోక్‌గజపతి రాజు నిరాడంబరంగా ఉంటారు.. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అయితే ఆయన మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఆయన సాధారణ ప్రయాణికుడిలా రైల్లో ప్రయాణిస్తున్నారంటే నమ్ముతారా.. అవును నిజమే ఆయన ఇప్పటికీ రైల్లోనే జర్నీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అశోక్‌గజపతి రాజు ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై సాధారణ ప్రయాణికుడిలా కూర్చుని కనిపించారు. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళుతుండగా ఎవరో గుర్తించి ఆయన ఫోటోను తీశారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అవుతోంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అయినా సరే.. ఇలా చాలా సింపుల్‌గా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.
టీడీపీ కూడా అశోక్‌గజపతిరాజు ఫోటోను ట్వీట్ చేసింది. 'రాజవంశీకులైన అశోక్‌గజపతి రాజు ఇలా సాధారణ ప్రయాణికుడిలా.. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో కనిపించారు. సొంత ఊరికి వెళ్లేందుకు రైలు కోసం స్టేషన్‌లో ఇలా వేచి చూస్తున్నారు. ఇది కచ్చితంగా ఆయన నిజాయితీ, గొప్పతనమే.. ప్రజలకు ఎంతో మేలు చేస్తుంటారు. అధికారం ఆయన్ను ఎప్పుడూ ప్రభావితం చేయదు.. అవినీతికి ఆస్కారం ఇవ్వరు' అంటూ ప్రశంసించారు. అశోక్‌గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978లో జనతా పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1982 నుంచి 1999 వరకు గెలుస్తూనే ఉన్నారు. 2004లో ఓటమి ఎదురుకాగా.. 2009లో తిరిగి విజయం సాధించారు. 2014లో మాత్రం విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి.. కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.