తిరుపతి జిల్లాలో కరెన్సీ కట్టలు కలకలంరేపాయి. ఎలాంటి పత్రాల్లేకుండా ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తున్న డబ్బుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిల్లకూరు మండలం బూదనం సమీపంలోని టోల్‌ప్లాజ్ దగ్గర పోలీసులు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే బస్సులో నూజివీడు ప్రాంతానికి చెందిన శ్రీరంగం అరవిందకృష్ణ అనే వ్యక్తి దగ్గర ఓ బ్యాగును గుర్తించారు. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే డబ్బులు (రూ.19 లక్షలు) తీసుకెళ్తున్నట్లు తేలింది. ఈ డబ్బుల్ని విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి తిరుపతిలో వేరొకరికి చేర్చాలని పంపినట్లు భావిస్తున్నారు. ఈ డబ్బులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. టోల్‌ప్లాజాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు పట్టుబడుతున్నాయి.. ఎవరైనా డబ్బుల్ని తీసుకెళుతుంటే.. కచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వెంట ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి పత్రాలు లేకపోతే డబ్బుల్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.