ఎట్టకేలకు మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో.. తాత్కాలికంగా సమ్మె విరమించాలని కార్మికులు నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు జీవోల రూపంలో విడుదలయ్యాక.. సమ్మెను పూర్తి విరమిస్తామని వెల్లడించారు. గురువారం నుంచే విధుల్లో చేరనున్నట్టు మున్సిపల్ కార్మికులు తెలిపారు. అయితే.. మున్సిపల్ కార్మికులు పలు డిమాండ్లతో సమ్మెకు దిగారు. 16 రోజుల పాటు నిరసన సాగింది. ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపగా.. ఫలించలేదు. తాజాగా.. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. డిమాండ్లపై హామీ ఇవ్వడంతో కార్మికులు.. తాత్కాలికంగా సమ్మె విరమించేందుకు అంగీకరించారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు స్పష్టం చేయడంతో అటు ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పలు చోట్ల వీధుల్లో, కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.