ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం.. కిరోసిన్ పోసుకున్న 8 మంది కుటుంబసభ్యులు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 08:48 PM

 కర్ణాటక అసెంబ్లీ భవనం ముందు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం పెను సంచలనంగా మారింది. బుధవారం బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో.. బ్యాంకు అధికారులు తమ ఇంటిని వేలం వేశారు. అయితే ఆ బాధను తట్టుకోలేని కుటుంబ సభ్యులు తమ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని విధాన సౌధ (కర్ణాటక అసెంబ్లీ) ముందుకు చేరుకున్నారు. కుటుంబంలోని మహిళలు, చిన్న పిల్లలు సహా 8 మంది తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అది గమనించిన అక్కడి పోలీసులు అలర్ట్ అయి వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో 2016 లో ఆ కుటుంబం రూ.50 లక్షల లోన్ తీసుకుంది. ఆ డబ్బుతో అల్లం సాగు చేసింది. అయితే అందులో భారీగా నష్టం రావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు తిరిగి కట్టడం కష్టమైంది. అయితే ఈఎమ్ఐలు చెల్లించడం ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారులు నోటీసులు అందించారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబ సభ్యులు లోన్ చెల్లించకపోవడంతో డైరెక్ట్‌గా బ్యాంకు అధికారులే రంగంలోకి దిగారు.


అయితే బ్యాంకు లోన్ కట్టకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఉంటున్న ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేశారు. అయితే తమ ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయడాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నిర్ణయంతోనే తమ కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.3 కోట్లు విలువ చేసే తమ ఇంటిని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.


అయితే ఆ 8 మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడాన్ని అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య నిరోధక చట్టాల కింద కేసు పెట్టారు. అయితే తమకు ఎదురైన సమస్యకు సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కుటుంబం తెలిపింది. తమ కుటుంబ సభ్యులకు చివరికి చిన్న పిల్లలకు కూడా కడుపు నిండా తిండిపెట్టేందుకు కూడా డబ్బులు లేదని ఆ కుటుంబం పోలీసులకు చెప్పింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com