ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్ధవ్ ఠాక్రేకు షాక్.. ఏక్‌నాథ్ షిండేదే నిజమైన శివసేన

national |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 08:51 PM

మరాఠా రాజకీయాల్లో మరో సంచలన మలుపు ఎదురైంది. ఏడాదిన్నర కాలంగా శివసేన పార్టీ కోసం అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. ఇటు ఏక్‌నాథ్ షిండే పోరాటం చేస్తుండగా.. ఎట్టకేలకు మహారాష్ట్ర స్పీకర్ ఈ వివాదాన్ని తేల్చారు. ఏక్‌నాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీ అని కుండ బద్ధలు కొట్టారు. దీంతో 18 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం స్పీకర్ రాహుల్ నర్వేకర్.. కీలక తీర్పు వెలువరించారు.


షిండే వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్న స్పీకర్ రాహుల్ నర్వేకర్.. ఆ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. అలాగే శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్‌ వర్గం చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. 1999 లో ఎన్నికల కమిషన్‌కు శివసేన సమర్పించిన పార్టీ రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని తెలిపారు. దాని ప్రకారం శివసేన ప్రముఖ్‌ (ఉద్ధవ్‌ ఠాక్రే)కు ఏ నేతనూ తొలగించే అధికారం లేదని స్పీకర్ తేల్చి చెప్పారు. దీంతో శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకు లేదని.. ఉద్ధవ్ ఠాక్రే రూపొందించిన పార్టీ రాజ్యాంగం కాపీ ఎన్నికల సంఘం వద్ద లేదని స్పీకర్ తన తీర్పులో వెల్లడించారు.


గతేడాది జూన్ నుంచి పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నర్వేకర్ తీర్పును వెల్లడించారు. 18 నెలల క్రితం శివసేన పార్టీలో నుంచి బయటికి వచ్చిన ఏక్‌నాథ్ షిండే.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీలో చీలిక తెచ్చారు. 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వైపు ఉండి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే సీఎంగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇటీవల ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. బీజేపీ, షిండే శివసేన కూటమిలో చేరారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఇద్దరూ కొనసాగుతున్నారు. స్పీకర్ తీర్పుతో షిండే వర్గం కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


అయితే శివసేన పార్టీని పార్టీ గుర్తు తమదేనని షిండే వర్గం, ఠాక్రే వర్గం సుప్రీం కోర్టుకు ఎక్కాయి. శివసేన పార్టీలో తిరుగుబాటు చేసిన 40 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఠాక్రే వర్గం వాదించింది. అయితే తామే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నామని.. తమదే అసలైన శివసేన పార్టీ అని షిండే వర్గం వాదించింది. దీంతో 2023 మే లో ఈ అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర స్పీకర్‌కే ఉందని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్లపై త్వరగా తీర్పు ఇవ్వాలని మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్ నర్వేకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తీర్పు వెలువరించిన రాహుల్ నర్వేకర్.. పార్టీ షిండే వర్గందేనని స్పష్టం చేశారు. అయితే గతంలో ఎన్నికల సంఘం కూడా నిజమైన శివసేన షిండేదే అని ఆయనకే విల్లు-బాణం గుర్తును కేటాయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com