తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని గుడ్‌బై చెప్పేశారు. బుధవారం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు. ఈ సందర్భంగా.. పార్టీలో తనకు కల్పించిన అవకాశాలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఆయన.. తనకు మద్దతిచ్చిన పార్టీ కేడర్, లీడర్లకు ధన్యవాదాలు చెప్పారు. అటు.. లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అంతకుముందు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కేశినేని నాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విజయవాడ పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని, తన హయాంలో 2014 నుంచి 2019 వరకు విజయవాడకు ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పనికిరారన్న ఆయన.. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని వ్యాఖ్యానించారు. తాను జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించు కున్నానని, తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరతానని చెప్పుకొచ్చారు.