కడప జిల్లాలోని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సీఎం జగన్ మొండిచేయి చూపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడాకు వైసీపీ టికెట్ ఇవ్వరని తేలిపోయింది. రాజంపేట టికెట్ ఆకెపాటి అమరనాథ్ రెడ్డికి ఇస్తున్నామని జగన్ మేడాకు చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జగన్ మేడాకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అమర్నాథ్ రెడ్డిని గెలుపునకు కృషి చేయాలని సూచించారట. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మేడాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులు క్రితం మేడా మల్లికార్జున రెడ్డిని పిలిచి టికెట్ నీకే అంటూ జగన్ చెప్పారు. అయితే ఈలోపు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయమై జగన్‌తో చర్చించినట్లు తెలిసింది. రాజంపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ సీఎం వద్ద పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి ఒత్తిడికి జగన్ తొలొగ్గి.. ఎమ్మెల్యే టికెట్‌ను అమరనాథ్ రెడ్డికి ఇచ్చారట. నాలుగు రోజుల కిందట టికెట్ ఇస్తామని చెప్పి.. మళ్లీ పిలిపించి టికెట్ ఇవ్వలేనని చెప్పడంతో జగన్ వైఖరిపై మేడా వర్గీయులు మండిపడుతున్నట్లు సమాచారం.