ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రూ. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు మంత్రి. అలాగే, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5-7 లక్షల వరకు సాయం పెంచామని తెలిపారు మంత్రి. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్నా ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు మంత్రి. ఇక ఈ సంక్రాంతి పండుగకు ప్రతి కార్మికునికి రూ. 1000 కొత్త బట్టలు కొనుగోలుకు ఇస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ ఇచ్చిన హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, అలాగే, హామీ అమలు కోసం గురువారం సాయంత్రానికి జీవో జారీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.