ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ ఆరోగ్య సురక్ష నిర్వహించేలా వేగంగా ప్రభుత్వ పెద్దలు అడుగులు వేస్తున్నారు. జనవరిలో 3,583 శిబిరాలను నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 1,315 శిబిరాలు పూర్తయ్యాయి. ఇక షెడ్యూల్ ప్రకారం గ్రామం/వార్డులో సురక్ష శిబిరం ఏర్పాటుకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు రెండో సారి వలంటీర్‌లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి జేఏఎస్–2 పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో పాటు, ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌లు మూడు వేల మంది వరకూ వైద్యులను, కంటి సమస్యల గుర్తింపునకు స్క్రీనింగ్ చేపట్టడానికి 562 పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను డిప్లాయ్ చేశారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు.