సమాజంలో అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనేనని, సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ లో పెను మార్పులు రాబోతున్నాయని గిడుగు రుద్రరాజు అన్నారు. సెట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ నెల 17 న స్క్రీనింగ్ కమిటి చైర్మన్ మధుసూదన్ వస్తున్నారని.. ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు రామమందిరం నిర్మాణమంటూ రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరారని, ఆమె అవసరం ఎక్కడ ఉందో అక్కడ ఆమెను హైకమాండ్ నియమిస్తుందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆమె రాకను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పొత్తులపై మాట్లాడుతున్నామని, రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని వివరించారు. వారితో భేటీ అయ్యి.. పొత్తులపై చర్చిస్తామని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.