కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. మోకాళ్ల పర్వతంపై డ్రోన్ ఎగురువేసిన ఘటన కలకలం రేపుతోంది. డ్రోన్‌ను క్యాప్చరింగ్ చేసిన పలువురు.. మోకాళ్ల పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను షూట్ చేశారు. తిరుమలలో డ్రోన్ ఎగురవేడం నిషేధం.. అయినప్పటికీ అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరిని అసోం వాసులుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య తిరుమల కొండలను వీడియో తీశారు. మొదటి ఘాట్ రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్‌తో చిత్రీకరించగా.. కొందరు ప్రయాణికులు వారిని సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది భద్రత నేపథ్యంలో తిరుమలలో ఎటువంటి డ్రోన్లను ఉపయోగించడానికి అనుమతి లేదు. కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు వెళ్లడానికి అనుమతిస్తారు. కానీ అధికారుల కళ్లుగప్పి డ్రోన్ కెమెరాను తీసుకురావడమే కాదు.. వీడియోలు తీయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆర్మీ కమాండర్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు. గతంలో శ్రీవారి ఆలయంపై అగంతకులు డ్రోన్ ఎగరవేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.