విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపు విషయంలో జగన్ సర్కారుకు మరోసారి నిరాశ ఎదురయ్యింది. తాజాగా ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దుచేయడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను మేం రద్దు చేయలేమని, యధావిదిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని, అప్పీల్‌ను ఎవరు వినాలనే దానిపై త్వరలో ప్రకటిస్తామన్న పేర్కొంది. క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజధాని ఆఫీసుల తరలింపు అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ఎన్ని కార్యాలయాలు, ఎంతమంది అధికారులను విశాఖకు తరలిస్తారనే అంశంపై వివరాలు అందజేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. క్యాంప్ ఆఫీసు ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారని, ఎంతమంది అధికారులు వెళ్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక, గత విచారణలో రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కాగా మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పట్లో తేలేలా లేవు. అటు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలే టైమ్ ఉంది. దాంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రాజధాని అంశం కంటే, పార్టీ ప్రక్షాళనపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.