శ్రీకాకుళం జిల్లా నిద్దాంకు చెందిన ఎర్నేన లక్ష్మినాయుడు ఎర్రవరంలోని ఓ ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తూ రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నాడు. మూడేళ్ల కిందట వివాహం కాగా భార్య, కుమార్తె నిద్దాంలో ఉంటున్నారు. ఈ క్రమంలో లక్ష్మినాయుడు ఆన్‌లైన్‌లో రమ్మీకి బానిసయ్యాడు. ఏడాది కాలంగా లక్ష్మినాయుడు ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌కు అలవాటు పడ్డాడు. ఇందుకోసం గత ఏడాది జులైలో సుమారు రూ.ఆరు లక్షలు అప్పులు చేసినట్లుగా తండ్రి రామనాయుడికి చెప్పాడు. రోజుల వ్యవధిలో రూ.మూడు లక్షల వరకూ అప్పులను తండ్రి నేరుగా తీర్చేశాడు. మరో రూ.3 లక్షలు కుమారుడి బ్యాంకు అకౌంట్‌లో వేసి అప్పుల వాళ్లకు చెల్లించమని సూచించారు.
అకౌంట్‌లో పెద్ద మొత్తంలో నగదు కనబడే సరికి తండ్రి మాట లెక్కచేయకుండా మళ్లీ ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడడం మొదలు పెట్టాడు. నెలలు గడిచే సరికి ఖాతా ఖాళీ కావడంతో పాటు తిరిగి మరో రూ.3 లక్షలు వరకు అప్పులు చేశాడు. ఆ తర్వాత ఈ నెల 6న ఉదయం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి చిన్నాన్న ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో.. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ క్రమంలో అతడి సెల్ ట్రాక్ చేసి గురువారం మధ్యాహ్నం యువకుడి మృతదేహం గుర్తించినట్లు సీఐ వి.పుల్లారావు తెలిపారు. దీంతో వరసకు చిన్నాన్న అయిన పోతురాజు ఉమా మహేశ్వరరావు ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరి ఫోన్ టవర్ లొకేషన్ గామన్ బ్రిడ్జి పరిసరాల్లో చూపించింది. దీంతో గోదావరిలో గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారు. జరిగిన విషయాన్ని కుటుంబీకులకు చెప్పలేక ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.