తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసి, అఘాయిత్యం చేశాడు 19 ఏళ్ల ఓ యువకుడు. ఆ తర్వాత ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇంతలో బాలిక ఎవరికైనా చెబితే తన పేరు బయటపడుందని భావించాడు. దీంతో బాలికను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం మరో యువకుడికి చెప్పి సాయం కోరాడు. వారిద్దరూ కలిసి బాలిక ఇంటికి చేరుకున్నారు. ఎలాగూ చంపేస్తున్నాం కదా అని ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను ఊపిరాడకుండా చేసి చంపేసి, చీరతో దూలానికి వేలాడదీసి.. ఉరేసుకొని చనిపోయినట్లు చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పరిధిలోని గూడెం కొత్తవీధి మండలంలోని ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకొంది.
జనవరి 2న చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను చింతపల్లి అడిషినల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్.. బుధవారం (జనవరి 10) మీడియాకు వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేష్ (19) ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత లైంగిక కోరిక తీర్చుకున్నాడు. అయితే, బాలికను రమేష్ లాక్కెళ్తుండగా ఇద్దరు చిన్నారులు చూశారు. చిన్నారుల ద్వారా బాలిక బంధువు ఒకరికి విషయం తెలియడంతో ఏం జరిగిందని బాధితురాలిని నిలదీశారు. దీంతో రమేష్ తనపై చేసిన దారుణాన్ని బాలిక చెప్పింది. ఇదిలా ఉండగా.. కాసేపటి తర్వాత రమేష్ తన మిత్రుడైన మరో ఆటో డ్రైవర్ సీతన్నతో కలిసి తిరిగి బాలిక ఇంటి వద్దకు వచ్చారు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు. ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశారు.
బాలికను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన అనంతరం గొంతుకు చీరతో ముడి వేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేలా దూలానికి వేలాడదీసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు దూలానికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆ తర్వాతి రోజు అంత్యక్రియల్లో భాగంగా బాలిక మృతదేహానికి స్నానం చేయిస్తుండగా.. ఆమె శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో బంధువులకు అనుమానం వచ్చింది. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా.. బాలిక మృతదేహాన్ని అదే రోజు (జనవరి 3) ఖననం చేశారు. బాలిక ఒంటిపై గాయాలు కనిపించడం.. ఈ విషయం కాలనీలో చర్చనీయాంశంగా మారడంతో ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు జనవరి 5న గూడెంకొత్తవీధి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సీఐ అశోక్ కుమార్, ఎస్సై అప్పలసూరి గ్రామానికి వెళ్లి అన్ని పలువురిని విచారించారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. దర్యాప్తు జరుగుతుండగానే.. నిందితులిద్దరూ ఎలాగైనా తమ పేర్లు బయటపడతాయని వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతో పాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అడిషినల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చెప్పారు.