మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర ప్రారంభం కానుండగా.. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు సంబంధించిన గీతాన్ని ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ‘భయపడకు.. బాధపడకు.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పార్టీ ప్రతి ఇంటి తలుపు తడుతుంది.. ప్రతి పరిసరాలను చేరుకుంటుంది’ అని అర్ధం వచ్చేలా ఉన్న ఈ గీతంలో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమైన ఫోటోలను జతచేసింది. సెప్టెంబరు 2022లో రాహుల్ గాంధీ దక్షిణాదిలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
న్యాయం కోసం పోరాటాన్ని నొక్కి చెబుతున్న ఈ గీతం.. నిశ్శబ్దంగా బాధపడొద్దని, భయపడొద్దని ప్రజలకు ఉద్బోధిస్తుంది. ఈ గీతం ఉన్న వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రతి తలుపు తడతాం.. ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రతి దారి, ప్రతి పరిసరాలు, పార్లమెంటులో న్యాయం జరిగే వరకూ విశ్రమించం... బాధపడకు, భయపడకు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. పేదలు ఆత్మగౌరవం కోల్పోయారని, నిరుద్యోగంతో యువత కలలు కల్లలయ్యాయని, మహిళలు తమకు దక్కాల్సిన గౌరవం కోసం తహతహలాడుతున్నారని గీతం పేర్కొంది.
అలాగే, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన, కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున దహన సంస్కారాలు, పార్లమెంట్‌లో ఎంపీలు తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రతిష్ఠాత్మక చట్టాలను హైలైట్ చేస్తున్న ఈ వీడియో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ఇతర కాంగ్రెస్ నేతలను కూడా ఇందులో పెట్టారు.
మరోవైపు, భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ వేదికను మారుస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్‌లో రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభానికి బీరేన్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇంఫాల్‌లోని హప్టా కాంగ్‌జెబుంగ్ నుంచి యాత్ర చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర.. ఈ నెల 14న మణిపూర్‌లో మొదలై మార్చి 30న ముంబయిలో ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.