తన నాలుగేళ్ల కుమారుడ్ని హత్యచేసిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ (Suchana Seth)కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతదేహాన్ని దాచిపెట్టిన సూట్‌కేసులో సుచనా సేథ్ రాసిన లేఖను గోవా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేపర్‌పై కాకుండా టిష్యూ మీద నోటురాసిన సుజనా సేథ్.. పెన్ను స్థానంలో ఐ లైనర్‌ను వాడినట్టు పోలీసులు తెలిపారు. లేఖను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ బృందానికి పంపామని పేర్కొన్నారు. టిష్యూపై ఐలైనర్‌తో రాసిన ఆరు లైన్ల ఈ లేఖను ఫోరెన్సిక్ బృందం చేతిరాత నిపుణుడు పరిశీలించనున్నారు.
అయితే, ‘కోర్టు, నా మాజీ భర్త నా కుమారుని కస్టడీకి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.. నేను దానిని ఇకపై ఎంతమాత్రం తట్టుకోలేను.. మాజీ భర్త చాలా క్రూరంగా ఉంటాడు... అతడు (నా) కుమారుడికి చెడు అలవాట్లు నేర్పేవాడు.. బిడ్డను ఒక్కరోజు కూడా కలవడం నాకు ఇష్టం లేదు’ అని అందులో రాసినట్టు తెలుస్తోంది. అయితే, హత్యచేయడానికి ముందు ఆమె.. ఓ లాలిపాట పాడి కుమారుడ్ని నిద్రపుచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో నోట్ చాలా కీలకమైన ఆధారమని, ఆమె మానసిక స్థితిని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. ‘కుమారుడ్ని మాజీ భర్త ఒక్క రోజు కూడా కలవడం ఆమెకు ఇష్టం లేదని, ఆదే ఆమె మనసులో మెదులుతూ తీవ్రమైన దశకు దారితీసింది’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ‘హత్య చేయడానికి ముందు ఆమె తన డాక్టర్, పేరెంటల్ థెరపిస్ట్‌తో టచ్‌లో ఉంది. బాలుడి మరణం తర్వాత ఆమె ఎవరికి ఫోన్ చేసిందో తెలుసుకోవడానికి మేము కాల్ వివరాలను ధృవీకరిస్తున్నాం’ అని అధికారి తెలిపారు.
సుచనా సేథ్- వెంకట్ రామన్ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉంగా.. విభేదాలతో విడాకులు తీసుకున్నారు. దంపతులకు కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది. వారంలో ఒకరోజు కుమారుడ్ని కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విషయం సుచనాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆదివారం తండ్రి వద్దకు కుమారుడిని పంపించేందుకు ఇష్టపడలేదు. అందుకోసమే కన్న కొడుకును దారుణంగా హత్య చేసింది.