గత కొన్ని నెలలుగా విమానాల్లో జరుగుతున్న ఘటనలు చిత్ర విచిత్రంగా తయారవుతున్నాయి. విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఇక మద్యం మత్తులో ప్రయాణికులు దాడులు చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వింత వింత ఘటనలకు దిగడం, విమాన సిబ్బందిపై దాడులకు దిగడం సంచలనంగా మారుతోంది. ఇక మరికొన్ని ఘటనల్లో ఎయిర్‌లైన్స్ సంస్థల తప్పులు, పొరపాట్లు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే విమానంలో నుంచి ఓ వ్యక్తి తలుపు తీసుకుని బయటికి దూకేశాడు.
కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ఈనెల 8 వ తేదీన ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ 747 విమానం టొరంటో ఎయిర్‌పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. రన్‌వేపై ఉన్న విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా క్యాబిన్ తలుపు తెరిచాడు. అది గమనించేలోపే అందులో నుంచి కిందకు దూకేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే విమానం రన్‌వేపై ఉన్నపుడు ఈ ఘటన జరగడంతో ఆ విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 20 అడుగుల ఎత్తు నుంచి ఆ ప్రయాణికుడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్ కెనడా అధికారులు తమ వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉందో ఎయిర్ కెనడా వెల్లడించలేదు. అయితే అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో అన్న విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టొరంటో ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో ఆ విమానం 6 గంటలు ఆలస్యంగా టొరంటో నుంచి దుబాయ్‌కి బయలుదేరింది. ఇక ఇటీవల ఎయిర్ కెనడా విమానంలో 16 ఏళ్ల కుర్రాడు వింతగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. తనతోపాటు ఉన్న తన కుటుంబ సభ్యులపైనే ఆ కుర్రాడు దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో గాయపడిన కుటుంబ సభ్యులను ఎయిర్ కెనడా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.